తెలుగుదనం అంటే బాపు బొమ్మ, తెలుగుదనం అంటే బాపు సినిమా!
on Dec 15, 2025
(డిసెంబర్ 15 చిత్రకారుడు, దర్శకుడు బాపు జయంతి సందర్భంగా..)
బాపు.. ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తన అందమైన చిత్రాలతో మధురానుభూతిని కలిగించి, వ్యంగ్య చిత్రాలతో నవ్వులు పూయించిన మేటి చిత్రకారుడు. అలాగే తన సినిమాలతో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని దర్శకుడు. ఆయన వేసిన బొమ్మ చూసినా, ఆయన తీసిన సినిమా చూసినా ఇది ఖచ్చితంగా బాపు మేథస్సు నుంచి పుట్టిందేనని సాధారణ ప్రజలు సైతం గుర్తిస్తారు. తన కళతో ప్రజలపై అంతటి ప్రభావాన్ని వేశారు. బొమ్మలు వేయడంలో ఎంతటి ప్రతిభ కనబరిచేవారో, అక్షరాలను అందంగా రాయడంలోనూ తన ప్రత్యేకతను చూపించేవారు. బాపు బొమ్మను ప్రచురించని పత్రిక లేదు. అలాగే నవలల కోసం బాపు వేసినన్ని బొమ్మలు మరే చిత్రకారుడూ వెయ్యలేదు. అంతేకాదు, తన పేరుతో ఒక ఫాంట్‌ను క్రియేట్ చేసి అక్షరాల్లోనూ అందాలు ఒలకబోసిన ఘనాపాటి బాపు. అందుకే బాపు రాత, బాపు గీత అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. అవన్నీ బాపు చెక్కిన శిల్పాలు. కథాంశం ఏదైనా సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు బాపు శైలి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆయన సినిమాల్లోని పాత్రలు, సన్నివేశాలు, మాటలు, పాటలు, నేపథ్య సంగీతం అన్నీ బాపు గుండెల్లో నుంచి బయటికి వచ్చినట్టుగానే అనిపిస్తాయి. ప్రేక్షకుల మనసులో మధురానుభూతిని కలిగిస్తాయి. తన బొమ్మల్లో ఎంతటి భావుకత్వం ఉంటుందో, తెరపై కదిలే బొమ్మల్లోనూ అదే భావుకత్వం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన సినిమాల్లో కథానాయికలు బాపు గీసిన బొమ్మలకు ప్రాణం పోసినట్టుగానే ఉంటారు. ‘బాపు బొమ్మ’ అనే మాట ఎంత ప్రాచుర్యం పొందిందో, బాపు సినిమాల్లోని కథానాయికలకు కూడా అంతటి ప్రాధాన్యం దక్కింది.
బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. 1933 డిసెంబరు 15న పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం కంతేరులో వేణుగోపాలరావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు. 1955లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి లాయర్ పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు. బాపు చిరకాల మిత్రుడు ముళ్ళపూడి వెంకటరమణ. శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటే అన్నంతగా వారి స్నేహబంధం చిరకాలం కొనసాగింది. నిజమైన స్నేహానికి నిదర్శనంగా బాపు, రమణలను చెప్పుకోవచ్చు. వీరిద్దరూ కలిసి సృష్టించిన బుడుగు, సీగాన పెసూనాంబ, రెండుజెళ్ళ సీత, అప్పుల అప్పారావు, గిరీశం, లావుపాటి పెళ్ళాం-బొచ్చుకుక్క లాంటి బుజ్జి మొగుడూ శీర్షికలు పాఠకులకు గిలిగింతలు పెట్టేవి.
అలా కొన్నేళ్ళపాటు బాపు తన బొమ్మలు, కార్టూన్లతోనూ, రమణ తన రచనలతో పాఠకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రతిరోజూ సినిమాలు చూసేవారు. సినిమా చూసిన తర్వాత అందులోని తప్పుల గురించి చర్చించుకుంటూ మైళ్ల కొద్దీ నడిచి ఇంటికి చేరేవారు. అలా సినిమాలు చూస్తున్న ఆ ఇద్దరికీ మనమే సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనల్ని పేపర్‌పై పెట్టి రాసిన రమణ కథకు తన బొమ్మలతో స్క్రీన్‌ప్లే రచించేవారు బాపు. తను చేసిన ప్రతి సినిమాకీ అదే పద్ధతిని పాటించారు.
1952లో వచ్చిన ఇంగ్లీష్ సినిమా ‘హై నూన్’ స్ఫూర్తితో 1959లో ఆంధ్రపత్రికలో ‘సాక్షి’ అనే కథను రాశారు రమణ. ఆ సినిమాలోని కౌబాయ్ పాత్రను బల్లకట్టు కిష్టప్పగా మార్చి ఆ కథనే మరికొన్ని మార్పులతో కృష్ణ, విజయనిర్మల జంటగా ‘సాక్షి’ చిత్రాన్ని రూపొందించారు బాపు. 1967లో ఈ సినిమా విడుదలైంది. అప్పుడు మొదలైన బాపు, రమణల సినీ ప్రయాణం దాదాపు 45 సంవత్సరాలు నిర్విఘ్నంగా కొనసాగింది. వీరిద్దరూ కలిసి 51 సినిమాలు చేశారు. తాము చేసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్త అంశాన్ని ప్రస్తావించేవారు. దాన్నే ఎంతో అర్థవంతంగా తెరపై ఆవిష్కరించేవారు.
బాపు కొన్ని వేల బొమ్మలు వేశారు. వాటిలో ఏది గొప్పది అని చెప్పడం ఎంత కష్టమో ఆయన తీసిన 51 సినిమాల్లో ఏది గొప్పది అని చెప్పడం కూడా అంతే కష్టం. దేనికదే ప్రత్యేకం అన్నట్టుగా ఉంటాయి. తన సినిమాల్లోని పాత్రల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు బాపు. ఎంతో మంది నటీనటులకు బాపు సినిమాలు మంచి గుర్తింపుని, అంతకుమించి మంచి భవిష్యత్తునీ ఇచ్చాయి.
బాపు సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చేది ‘ముత్యాల ముగ్గు’. 1975లో విడుదలైన ఈ సినిమాలో తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఇందులోని ప్రతి పాత్రలోనూ వైవిధ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా రావుగోపాలరావు పోషించిన కాంట్రాక్టర్ పాత్ర ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటుంది. అప్పట్లోనే ఈ సినిమాలోని రావుగోపాలరావు డైలాగులు రికార్డుల రూపంలో వచ్చాయంటే అవి ఎంత ప్రజాదరణ పొందాయో అర్థం చేసుకోవచ్చు. రామాయణం స్ఫూర్తితో రూపొందించిన ఈ సినిమాకి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. అలాగే ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ఇషాన్ ఆర్య జాతీయ అవార్డు అందుకున్నారు.
సాక్షి తర్వాత బాపు దర్శకత్వం వహించిన సినిమాల్లో బుద్ధిమంతుడు, సంపూర్ణ రామాయణం, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, భక్తకన్నప్ప, గోరంత దీపం, మనవూరి పాండవులు, తూర్పు వెళ్లే రైలు, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య, రాధాకళ్యాణం వంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొంది బాపు రూపొందించిన సినిమాల్లో క్లాసిక్స్‌గా నిలిచాయి. తెలుగులో ఘనవిజయం సాధించిన తన సినిమాలను హిందీలో కూడా రీమేక్ చేశారు బాపు. అలా 9 హిందీ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక 1990వ దశకంలో భారాభర్తల మధ్య ఉండాల్సిన నమ్మకం గురించి, వారి బంధం గురించి తెలియజెప్పే కథతో రూపొందిన పెళ్లి పుస్తకం, మహిళల ఆత్మాభిమానం గురించి, వారి శక్తి గురించి తెలియజెప్పే చిత్రంగా వచ్చిన మిస్టర్ పెళ్లాం చిత్రాలు ఘన విజయం సాధించాయి. బాపు దర్శకత్వం వహించిన చివరి చిత్రం 2011లో వచ్చిన శ్రీరామరాజ్యం.
చిత్రకారుడిగా, కార్టూనిస్ట్‌గా, దర్శకుడిగా బాపు అందుకున్న పురస్కారాలకు లెక్కే లేదు. 2013లో పద్మశ్రీ పురస్కారంతో కేంద్రప్రభుత్వం బాపుని సత్కరించింది. అలాగే 1986లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్.. బాపుకి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింది. ఉత్తమ దర్శకుడిగా 6 సార్లు నంది అవార్డు అందుకున్నారు బాపు. అలాగే ఉత్తమ దర్శకుడిగా రెండుసార్లు ఫిలింఫేర్ అవార్డు లభించింది. అంతేకాదు ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా బాపుని వరించింది. ఇవికాక వివిధ సంస్థలు అనేక అవార్డులతో ఆయన్ని సత్కరించాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రాణ స్నేహితులుగా బాపు, రమణలకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. స్నేహానికి మారుపేరుగా జీవితాంతం కలిసే ఉన్న బాపు, రమణ.. 2011లో విడిపోవాల్సి వచ్చింది. అది కూడా ముళ్ళపూడి వెంకటరమణ మరణంతో. 2011 ఫిబ్రవరి 24 అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. స్నేహితుడి మరణం బాపుని బాగా కుంగదీసింది. ఎంతో మనో వేదనకు లోనయ్యారు. బాపు జీవితంలో అనేకసార్లు గుండెపోటు వచ్చింది. ఆఖరు సారి 2014 ఆగస్ట్‌లో గుండెపోటు రావడంతో చెన్నయ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ 2014 ఆగస్ట్ 31న తుదిశ్వాస విడిచారు బాపు. ఆయన అంత్యక్రియలను తమిళనాడు ప్రభుత్వం అధికార లాంఛనాలతో జరిపించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



